ద్రాక్షారామమే దక్షిణ కాశీ
పంచారామ క్షేత్రాలలో ద్రాక్షారామం ఒకటిగా కనిపిస్తుంది. పూర్వం 'దక్షారామం'గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం, కాలక్రమంలో ద్రాక్షారామంగా పిలవబడుతోంది. పరమశివుడు ఇక్కడ 'భీమేశ్వరుడు'గా కొలవబడుతుంటాడు. సాక్షాత్తు వ్యాసుడు ఇక్కడి స్వామివారిని దర్శించుకుని, తపస్సు చేసుకున్నాడని స్థల పురాణం చెబుతోంది. కాశీలో భిక్ష దొరకని కారణంగా వ్యాసుడు కాశీ నగరాన్ని శపించబోతాడు. అప్పుడు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు వచ్చి స్వయంగా భోజనం వడ్డించి, ఆయన ఆకలి బాధ తీరిన తరువాత ఇక కాశీ నగరాన్ని విడిచి వెళ్లవలిసిందిగా చెబుతారు.
విశ్వనాథుడిని వదిలి వెళ్లడానికి వ్యాసుడు అంగీకరించడు. దక్షారామం వెళ్లి అక్కడి భీమేశ్వరుడిని పూజించమనీ, దక్షారామం దక్షిణ కాశీ అనీ .. అక్కడి స్వామి విశ్వనాథుడి ప్రతిరూపమని పార్వతీదేవి చెబుతుంది. దాంతో అక్కడి నుంచి బయలుదేరిన వ్యాసుడు .. అగస్త్య మహర్షిని కలుసుకుంటాడు. అగస్త్య మహర్షితో కలిసి అనేక క్షేత్రాలను ఆకాశ మార్గం ద్వారా దర్శిస్తూ దక్షారామానికి చేరుకుంటాడు. అక్కడ అనునిత్యం ఆ స్వామి సేవలో గడుపుతాడు. అంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన, సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరతాయి.