ఏకాదశ రుద్రులలో పదవ రుద్రుడు కపాలి
ఏకాదశ రుద్రులలో పదవ రుద్రుడుగా 'కపాలి' కనిపిస్తాడు. ఒకానొక సందర్భంలో బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండించి .. ఆ కపాలాన్ని ధరించిన కారణంగా ఈయనకి 'కపాలి' అనే పేరు వచ్చింది. తాను వచ్చినప్పుడు లేచి నిలబడలేదనే కోపంతో ఈ కపాలి రుద్రుడినే దక్షప్రజాపతి అవమానపరచాలని అనుకుంటాడు. అందుకు నిరీశ్వర యాగం మొదలుపెడతాడు. కపాలి రుద్రుడు వారించినా వినకుండా అక్కడికి వెళ్లిన సతీదేవి, తండ్రిచేత అవమానించబడి యోగాగ్నిలో తన శరీరాన్ని దహింపజేస్తుంది.
ఈ విషయం తెలిసి కపాలి రుద్రుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తన 'జట' నుంచి ఒక పాయను తీసి బండపై విసిరికొడతాడు. ఆ బండ రెండు ముక్కలు కాగా, ఒక భాగం నుంచి వీరభద్రుడు .. మరో భాగం నుంచి భద్రకాళి ఆవిర్భవిస్తారు. వీరభద్రుడు దక్షుని శిరస్సును ఖండించగా .. ఆ శిరస్సును యజ్ఞ కుండంలో పడేలా భద్రకాళి చేస్తుంది. ఆ తరువాత వీరభద్రుడు .. భద్రకాళి కలిసి కపాల రుద్రుడు దగ్గరికి వచ్చి, దక్ష యజ్ఞాన్ని ఎలా నాశనం చేసింది చెప్పి ఆయనను శాంతిపజేస్తారు.