నాలుగు ముఖాలతో పశుపతినాథుడు
ఏకాదశ రుద్రులలో ఎనిమిదవ రుద్రుడుగా 'హరుడు' కనిపిస్తాడు. పరమశివుడు బ్రహ్మగా లోకాలను సృష్టిస్తూ .. రుద్రుడిగా వాటిని హరిస్తూ ఉంటాడు. సృష్టించడం .. హరించడం రెండూ ఆయనే చేస్తూ ఉంటాడు. తనని శరణు కోరిన భక్తుల తాపాలను హరిస్తాడు గనుకనే ఆయన హరుడిగా పిలవబడుతున్నాడు. ఏకాదశ రుద్రులలో ఎనిమిదవ వాడైనా హరుడి ఆధిభౌతిక రూపం నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో పశుపతినాథుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది.
పశుపతినాథ క్షేత్రంలో భక్తులకు దర్శనమిచ్చేదే 'యజమాన లింగం'. యజమాన లింగానికి నాలుగు వైపులా నాలుగు ముఖాలు ఉంటాయి. నాలుగు ముఖాలను దర్శించుకోవడానికి వీలుగా గర్భాలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి. అలాగే నాలుగు ద్వారాల చెంత నాలుగు ధ్వజ స్తంభాలు ఉంటాయి. పురాణాలన్నింటిలోను పశుపతినాథ క్షేత్రం ప్రస్తావన ఉండటం విశేషం. అంతటి విశిష్టతను సంతరించుకున్న పశుపతినాథ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.