దేవతలు మేల్కొని వుండే ఉత్తరాయణ కాలం
సంక్రాంతి పండుగతో ఉత్తరాయణకాలం మొదలవుతుంది. దక్షిణాయనం కంటే ఉత్తరాయణం ఎంతో శ్రేష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దేవతలకి దక్షిణాయన కాలం రాత్రి అయితే, ఉత్తరాయణ కాలం పగలు. ఉత్తరాయణ కాలంలో దేవతలు మెలకువతో ఉంటారు.
అందువలన ఉత్తరాయణ కాలంలో చేసే పూజలు .. జపాలు .. హోమాలు .. దేవాలయ ప్రతిష్టలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. అక్షరాభ్యాసాలు .. ఉపనయనాలు .. గృహప్రవేశాలు .. వివాహాలు .. వ్రతాలు ఆచరించడం మంచిది. దేవతలు మెలకువతో ఉండటం వలన వారి ఆశీస్సులు .. అనుగ్రహం తప్పక లభిస్తాయి. అందువలన శుభకార్యాలు జరపాలనుకునేవారు ఉత్తరాయణ కాలంలో అందుకు సంబంధించిన సన్నాహాలను మొదలెట్టేసి, దైవానుగ్రహంతో వాటిని పూర్తి చేయవచ్చు.