జలధారలతో అభిషేకమంటే మహా శివుడికి మహా ఇష్టం

పరమశివుడికి అభిషేకం జరుగుతూ వుంటే మనసు ఆహ్లాదాన్ని పొందుతుంది .. అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంది. జలధారలతో స్వామివారికి అభిషేకం జరుపుతూ వుంటే, ఎంత సేపైనా అలా చూస్తుండి పోవాలనిపిస్తుంది. జలధారలతో అభిషేకమంటే మహా శివుడికి మహా ఇష్టమట. దేవదానవులు సముద్ర మథనం చేయగా అమృతంతోపాటు విషం కూడా పుట్టింది. లోక కల్యాణం కోసం పరమశివుడు ఆ విషాన్ని తన గరళంలో దాచుకున్నాడు.

అయితే ఆ విషం యొక్క తీవ్రతను ఆయన భరించలేకపోయాడు. ఆయన శరీరమంతా కూడా వేడిగా మారిపోయింది. పరిస్థితిని గమనించిన దేవతలు కావిళ్లతో నదీ జలాలు తీసుకొచ్చి ఆయన తలపై గుమ్మరించడం మొదలుపెట్టారు. ఆ చల్లదనానికి శివుడికి ఉపశమనం కలిగింది .. అలా ఉపశమనాన్ని పొందుతూ ఆయన చిరు మందహాసం చేశాడట. అప్పటి నుంచి ఆయనకి జలధారలతో అభిషేకం అంటే ఇష్టం కలిగిందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు స్వామివారికి అభిషేకం చేస్తూ .. అర్చకులతో చేయిస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఆయన కరుణాకటాక్ష వీక్షణాలకి పాత్రులవుతుంటారు.   


More Bhakti News