సంతానం ఆరోగ్యం కోసం ఇలా చేయాలి
పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. వాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే అందుకు తగిన విధంగా తమ పనులకి సంబంధించిన ప్రణాళిక రచన చేసుకుంటూ వుంటారు. తమ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నంతవరకే తల్లిదండ్రులు సంతోషంగా వుంటారు. పిల్లలు అనారోగ్యానికి లోనైతే వాళ్లు తీవ్రమైన ఆందోళన చెందుతారు. నిద్ర .. ఆహారాలు మానుకుని పిల్లల దగ్గరే ఉంటూ .. వాళ్లకి సేవలు చేస్తారు.
తమ పిల్లల ఆరోగ్యం కుదుటపడేలా చేయమనీ, వాళ్లు కోలుకోగానే ఫలానా ఫలానా మొక్కులు చెల్లిస్తామని ఇష్టదైవానికి మొక్కుకుంటూ వుంటారు. కొంతమంది పిల్లలు తరచూ అనారోగ్యానికి లోనవుతూ వుంటారు. అప్పుడు ఇక ఆ తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంతా కాదు. అలా పిల్లలు తరచూ అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే, ఆవు - దూడలకు ఆహారాన్ని అందించాలనేది మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. ఆవు - దూడల పోషణ భారాన్ని వహించడం వలన కలిగే ఫలితం .. సంతానం ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన లేకుండా చేస్తుందట. అందువలన వీలైనంత వరకూ ఆవు - దూడల పోషణకి కొంతమొత్తాన్ని కేటాయించడం మంచిది.