లింగరూపంలో ఆవిర్భవించిన నరసింహస్వామి

నరసింహస్వామి ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలుగా యాదగిరి గుట్ట .. వాడపల్లి .. వేదాద్రి .. వలిగొండ దర్శనమిస్తాయి. అలాంటి క్షేత్రాల సరసన 'సింగోటం' అనే క్షేత్రం కూడా వెలుగొందుతోంది .. ఇది మహబూబ్ నగర్ జిల్లా పరిథిలో కనిపిస్తుంది. నరసింహస్వామివారు లింగరూపంలో ఆవిర్భవించడం ఇక్కడి ప్రత్యేకత. పూర్వం ఒక రైతు తన పొలాన్ని దున్నుతూ ఉంటే, లింగరూపంలో ఒక రాయి నాగలికి తగిలి పైకి వచ్చింది.

ఆ రోజు రాత్రి సురభి వంశానికి చెందిన సింగమ నాయుడు అనే రాజుకి స్వప్నంలో నరసింహస్వామివారు కనిపించి, తనకి ఆలయం నిర్మించి .. లింగరూపంలో గల తనని అందులో ప్రతిష్ఠించమని ఆదేశించాడట. దాంతో సింగమనాయుడు స్వామివారు చెప్పిన జాడను పట్టుకుంటూ వెళ్లి, పొలంలోని స్వామివారి మూర్తిని తెచ్చి ప్రతిష్ఠించినట్టుగా స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయానికి ఎదురుగా గల కొండపై 'రత్నలక్ష్మి అమ్మవారు కొలువై పూజలు అందుకుంటూ ఉండటం విశేషం. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన, సమస్త దోషాలు తొలగిపోయి .. సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.    

More Bhakti Articles