దైవ నామ స్మరణ ఫలితం
దైవమే ప్రకృతి ద్వారా సమస్త జీవరాశికి అవసరమైన ఆహారాన్ని అందిస్తూ .. ఈ జగత్తును నడిపిస్తోంది. అలాంటి దైవాన్ని అనునిత్యం కీర్తిస్తూ .. అనుక్షణం స్మరిస్తూ తరించిన మహాభక్తులు .. మహానుభావులు ఎంతో మంది వున్నారు. పోతన .. త్యాగయ్య .. క్షేత్రయ్య .. అన్నమయ్య .. రామదాసు .. తులసీదాసు .. పురందరదాసు .. కబీరుదాసు .. నామదేవుడు .. జ్ఞానదేవుడు .. ఏకనాథుడు .. తుకారామ్ .. గోరా .. మీరాబాయి .. తరిగొండ వేంగమాంబ ఇలా ఎంతోమంది భక్తులు భగవంతుడి నామాన్ని స్మరించారు .. ఆయన లీలా విశేషాలను కీర్తించారు.
అసలైన ఆనందం .. నిజమైన సంతోషం భగవంతుడి సన్నిధిలోనే వుంటాయని లోకానికి చాటి చెప్పారు. భౌతికపరమైన సుఖాలు అశాశ్వతమని చెప్పి, ఆధ్యాత్మిక చింతనలోని అనుభూతిని ఆవిష్కరించారు. సమస్త జీవులపట్ల దయను .. ప్రేమను చూపుతూ, భగవంతుడి సేవకు మనసును అంకితం చేయమని చెప్పారు. భగవంతుడి నామాన్ని స్మరించేవాళ్లు ఎప్పుడూ భగవంతుడికి సమీపంలోనే ఉంటారనీ, అలాంటివారి జన్మ తరిస్తుందనీ .. ఉత్తమ జన్మ లభిస్తుందని సెలవిచ్చారు.