అసత్యములాడనివారి పట్లనే లక్ష్మీదేవి అనుగ్రహం

జీవితం సంతోషంగా .. సాఫీగా సాగిపోవాలంటే డబ్బు చాలా అవసరం. విలాసాల సంగతి అటుంచితే చాలా అవసరాల నుంచి .. ఆపదల నుంచి బయటపడటంలో డబ్బే ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. అయితే డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే .. అది స్థిరంగా ఉండటం మరొక ఎత్తు. కొంతమంది ఎంతగా సంపాదించినా ఏదో ఒక కారణంగా అది ఖర్చయి పోతుంటుంది. అవసరానికి చేతిలో డబ్బులేక అవస్థలు పడాల్సి వస్తుంది.

అలా జరక్కుండా ధర్మబద్ధంగా సంపాదించడానికి మార్గాలు లభించి .. సంపాదించిన ధనం స్థిరంగా వుండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల పట్ల ప్రేమ .. అతిథులపట్ల అభిమానం .. పెద్దల పట్ల గౌరవం .. మూగ జీవాలపట్ల సానుభూతిని చూపేవారు చేసే పూజలపట్ల లక్ష్మీదేవి ప్రీతి చెందుతుందట. అలాగే ధర్మబద్ధమైన మార్గంలో నడుస్తూ .. అసత్యములాడని వారి ఇంట ఉండటానికి లక్ష్మీదేవి ఆసక్తిని చూపుతుంది. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆశించేవారు, పవిత్రమైన .. ధర్మబద్ధమైన .. సత్యవంతమైన జీవితాన్ని కొనసాగించవలసి వుంటుందనే విషయాన్ని మరిచిపోకూడదు.        

More Bhakti Articles