ఆపదలను తొలగించే త్రిపురాంతకేశ్వరుడు
కాకతీయుల కాలంలో ఎన్నో శివాలయాలు నిర్మించబడ్డాయి. అలాంటి శివాలయాల్లో ఒకటి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం .. 'ఆళ్లగడప'లో కనిపిస్తుంది. ఇక్కడి పరమశివుడు 'త్రిపురాంతకేశ్వరుడు'గా భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఇక్కడి ఆలయం చిన్నదే అయినా .. స్వామివారు మహిమాన్వితుడు అని భక్తులు విశ్వసిస్తుంటారు.
ఆలయ ప్రాంగణంలోనే కాకతీయుల కాలంలో వేసిన శిలా శాసనం వుంది. స్వామివారికి ఎదురుగా రెండు నందులు ఉండటం విశేషం. స్వామివారి దర్శనం చేసుకోవడం వలన దారిద్ర్య బాధలు .. వ్యాధులు తొలగిపోతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతారు. సమస్త పాపాలు తొలగిపోయి .. సకల శుభాలు చేకూరతాయని అంటారు. ప్రతి సోమవారం రోజున స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక శివరాత్రికి ఇక్కడ స్వామివారి కల్యాణం ఘనంగా జరుగుతుంది. గ్రామస్తులంతా కూడా స్వామిని ఇలవేల్పుగా భావిస్తూ .. పూజిస్తూ తరిస్తుంటారు.