ఇక్కడి వైతరణీ నదిని దాటితే స్వర్గానికి వెళతారట
అష్టాదశ శక్తి పీఠాలలో గిరిజాదేవి శక్తిపీఠం ఒకటి. ఇది ఒరిస్సాలోని జాజిపూర్ లో వుంది. సతీదేవి 'నాభి' పడిన ప్రదేశం కావడం వలన, 'నాభి క్షేత్రం' అని భక్తులు పిలుస్తుంటారు. 'పార్వతీ క్షేత్రం'గా .. 'వైష్ణవీ క్షేత్రంగా' కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పురాణాల్లో మనకి కనిపించే 'వైతరణీ నది' ఇక్కడ ప్రవహిస్తూ వుంటుంది. గిరిజాదేవి శక్తిపీఠానికి సమీపంలో కనిపించే ఈ వైతరణీ నదిని దాటితే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని స్థలపురాణం చెబుతోంది.
పూర్వం పాండవులు ఈ వైతరణీ నదిలో స్నానం చేసి .. పితృ దేవతలకి పిండ ప్రదానం చేశారట. ఇక రావణాసురుడు కూడా ఇక్కడి వైతరణీ నదిలో స్నానం చేసి .. పిండప్రదానం చేసినట్టు చెబుతారు. ఈ కారణంగానే పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. ఇక ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత వుంది. ఇక్కడి వైతరణీ నదీ తీరంలో జగన్నాథ స్వామి ఆలయం వుంది. పూరి జగన్నాథస్వామి ఆలయానికంటే ఇక్కడి ఆలయం ప్రాచీనమైనదనే మాట స్థానికుల నుంచి వినిపిస్తూ ఉంటుంది.