సుందరకాండ పారాయణ ఫలితం
జీవితంలో ముందుకు వెళ్లాలంటే తలపెట్టిన కార్యాలు ఎన్నో సఫలీకృతం కావాలి. ఎన్నో కష్టాలుపడి పూనుకున్న కార్యాలు సఫలీకృతం కావాలంటే, అందుకు భగవంతుడి అనుగ్రహం కావాలి. భగవంతుడి అనుగ్రహంతోనే 'కల' నిజమవుతుంది .. ఆశ నెరవేరుతుంది .. నిరీక్షణ ఫలిస్తుంది. ఒక్కోసారి తలపెట్టిన కార్యాలకి అనేక రకాల అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఆటంకాలను .. అవరోధాలను దాటుకుని ముందుకు వెళ్లడం చాలా కష్టమవుతుంటుంది.
ఆ కార్యాన్ని మధ్యలో వదిలేయడం వలన వచ్చే నష్టం ఎక్కువగా ఉంటుంది. పూర్తి చేయడానికి అవసరమైన వనరులు అందుబాటులోకి రాక నిరాశ నిస్పృహలకు లోనవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే 'సుందరకాండ' పారాయణం చేయాలనేది మహర్షుల మాట. శ్రీరామచంద్రుడు తనకి అప్పగించిన కార్యాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయక హనుమంతుడు సాధించుకు వచ్చాడు. అలాంటి హనుమంతుడిని అంకితభావంతో పూజిస్తూ .. సేవిస్తూ 'సుందరకాండ' పారాయణం చేయడం వలన ఆయన ప్రీతి చెందుతాడు. ఫలితంగా అడ్డంకులు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.