శ్రీ కనకధారా స్తోత్ర పఠన ఫలితం
శ్రీ శంకర భగవత్పాదులవారు ఒక రోజున భిక్షకి ఒక ఇంటికి వెళ్లారు. ఆ ఇంటి యజమానురాలు పేదరికంతో ఎన్నో ఇబ్బందులు పడుతోంది. తన ఆకలి తీర్చుకునే మార్గమే తోచక పస్తులుంటున్న ఆ పేదరాలు, శంకర భగవత్పాదులవారికి 'ఏమీలేదు' అని చెప్పలేకపోయింది. భిక్షను సమర్పించకుండగా స్వామిని పంపించడానికి ఆమెకి మనసు రాలేదు. అలాంటి పరిస్థితి తనకి వచ్చినందుకు ఆమె ఎంతో బాధపడింది. చివరికి తన దగ్గరున్న ఒక ఉసిరికాయను .. స్వామివారికి భిక్షగా సమర్పించింది.
దాంతో ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందనే విషయం ఆయనకి అర్థమైపోయింది. ఆ పేదరాలి దారిద్ర్యాన్ని తొలగించమని శంకర భగవత్పాదులవారు .. లక్ష్మీదేవిని స్తుతించారు. దాంతో లక్ష్మీదేవి అనుగ్రహించి ఆ పేదరాలి ఇంట కనకధారను కురిపించింది. స్వామివారి చేసిన ఆ స్తోత్రమే 'కనకధారా స్తోత్రం' అయింది. ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతోన్న వాళ్లు .. దారిద్ర్య దుఃఖాన్ని అనుభవిస్తోన్న వాళ్లు 'కనకధారా స్తోత్రం' అనునిత్యం పఠించడం వలన, ఆశించిన ఫలితం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.