వరాలనిచ్చే వేంకటేశ్వరుడు

వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో 'ఎన్నవరం' ఒకటిగా కనిపిస్తుంది.  వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో .. కొండ పైభాగంలో ఇక్కడ వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తుంటాడు. స్వామివారి మూర్తి చాలా కుదురుగా .. సమ్మోహనంగా కనిపిస్తుంది. కొండ చీలినట్టుగా వుండి అది కోనేరుగా మారిన దృశ్యం భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ కోనేరు చాలా లోతైనదని గ్రామస్థులు చెబుతుంటారు.

ఈ కోనేరులోని నీరు ఇంకిపోవడమనేది ఇంతవరకూ జరగలేదని అంటారు. స్వామివారి పాద ముద్రలు కోనేటి ఒడ్డున కనిపించడం వలన .. ఇది దివ్యమైన తీర్థమని చెబుతారు. గ్రామస్థుల ఇలవేల్పుగా .. కోరిన వరాలనిచ్చే దైవంగా ఇక్కడి వేంకటేశ్వరుడు కనిపిస్తుంటాడు. స్వామితో చెప్పుకుంటే ఎంతటి కష్టమైనా వెంటనే తీరిపోతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామివారి అనుగ్రహం వలన ధర్మ బద్ధమైన కోరికలు నెరవేరతాయని అంటారు. స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనడం వలన దారిద్ర్య దుఃఖాలు తొలగిపోతాయనీ, వ్యాధులు .. బాధలు దూరమవుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.   

More Bhakti Articles