దర్శన మాత్రం చేతనే ధన్యులను చేసే సీతారాముల కల్యాణం
సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రుడిగా .. లక్ష్మీదేవియే సీతాదేవిగా భూలోకాన అవతరించారు. లోక కల్యాణం కోసమే సీతారాముల అవతరణ జరిగింది. మూర్తీభవించిన ధర్మస్వరూపుడిగా శ్రీరామచంద్రుడు .. ఆదర్శానికి ఆనవాలుగా సీతమ్మ తల్లి మానవ మాత్రులుగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. మానవులంతా ఎలా నడచుకోవాలో .. ఎలా మసలుకోవాలో లోకానికి తెలియజేస్తూ .. ధర్మసంస్థాపన చేస్తూ సీతారాములు ముందుకుసాగారు.
ఈ కారణంగానే ఏ గ్రామంలో చూసినా రామాలయం తప్పకుండా కనిపిస్తుంది. ఆ గ్రామస్తుల ఐక్యతకు .. సఖ్యతకు నిదర్శనంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక శ్రీరామనవమి అనేది ప్రతి గ్రామంలో ఒక పండుగలా .. సంబరంలా జరుగుతుంది. సీతారాముల కల్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొంటారు. సీతారాములకు ఇష్టమైన కమలాపండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. పానకం .. వడపప్పులను ప్రసాదంగా తీసుకుని తరిస్తారు. వివిధ వాహన సేవలపై సీతారాముల ఊరేగింపు భక్తిసాగరంలో ఓలలాడిస్తుంది. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి .. సకల శుభాలు కలుగుతాయనేది మహర్షుల మాట.