కలలో పిల్లి కనిపిస్తే ఫలితం
ఎవరైనా ఏదైనా శుభకార్యానికి సంబంధించిన పనులపై బయల్దేరుతున్నప్పుడు 'శుభశకునం' చూసుకుని బయలుదేరుతారు. మంచి శకునం చూసుకుని వెళ్లడం వలన అది సఫలీకృతం అవుతుందనీ, లేదంటే ఆటంకాల కారణంగా ఆలస్యం జరుగుతుందని చాలామంది విశ్వసిస్తుంటారు. శుభకార్యం నిమిత్తమై బయల్దేరిన సమయంలో 'పిల్లి' ఎదురైతే మాత్రం అది అపశకునంగా భావిస్తారు. వెనక్కి వచ్చేసి కాళ్లు కడుక్కుని .. కాసిన్ని మంచినీళ్లు తాగేసి .. కాసేపు కూర్చుని ఆ తరువాత బయలుదేరుతారు.
'పిల్లి' ఎదురు రావడం వలన కార్యహాని కలుగుతుందనే కారణంగానే అలా చేస్తారు. అలాంటప్పుడు కలలో 'పిల్లి' కనిపిస్తే ఎలాంటి ఫలితం ఎదురుకావొచ్చనే సందేహం సహజంగానే కలుగుతుంటుంది. కలలో 'పిల్లి' కనిపించడం వలన కొన్ని ఇబ్బందులు .. ఆటంకాలు ఎదురవుతాయని అంటారు. ఒకవేళ 'పిల్లి'ని తరుముతున్నట్టుగా కల వస్తే మాత్రం ఆటంకాలు తొలగిపోతాయని అర్థం చేసుకోవాలని చెబుతారు. తలపెట్టిన కార్యాలకి అడ్డంకులు తొలగిపోయి, ఆ కార్యాలు సాఫీగా పూర్తవుతాయని అంటారు.