బూరుగుగడ్డ క్షేత్రం ప్రత్యేకత
సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా గర్భాలయంలో ఒక ప్రధాన దైవం కొలువై ఉంటుంది. స్వామివారితో పాటు అమ్మవార్లు కొలువై ఉండటం సహజం. కానీ వేరు వేరు మూర్తులు ఒకే గర్భాలయంలో .. ఒకే పీఠంపై కొలువై ఉండటం చాలా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన క్షేత్రంగా 'బూరుగుగడ్డ' కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సమీపంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడ 'శ్రీ ఆదివరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి' ఆలయం కనిపిస్తుంది.
కాకతీయుల కాలంలో విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం, అలనాటి వైభవానికి అద్దంపడుతూ ఉంటుంది. ఈ ఆలయంలోని గర్భాలయంలో శ్రీ భూదేవి సమేత వరాహస్వామి .. లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి .. వేణుగోపాలస్వామి దర్శనమిస్తుంటారు .. ఇదే ఈ క్షేత్రం ప్రత్యేకత. గోదాదేవి మాత్రం ప్రత్యేకమైన మందిరంలో పూజలు అందుకుంటూ ఉంటుంది. ఇది మహిమాన్వితమైన క్షేత్రమనీ .. ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త దోషాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.