మహిమాన్వితుడు మట్టపల్లి నరసింహుడు
కృష్ణానదీ తీరంలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో 'మట్టపల్లి' ఒకటి. సూర్యాపేట జిల్లాలో .. హుజూర్ నగర్ సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. రాజ్యలక్ష్మి సమేతుడై స్వామివారు ఇక్కడ ఆవిర్భవించారు. ఉగ్రరూపంలో వున్న స్వామివారిని శాంతపరిచిన ప్రహ్లాదుడిని కూడా స్వామివారి సన్నిధిలో చూడవచ్చు. గుహలో వెలసిన స్వామివారు .. మాచిరెడ్డి అనే భక్తుడి కారణంగా వెలుగులోకి వచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది.
కృష్ణానదిలో స్నానం చేసిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దుష్ట శక్తులచే పీడించబడుతున్నవారు .. గ్రహ దోషాల కారణంగా ఇబ్బందులు పడుతున్నవారు .. మానసిక .. శారీరక పరమైన సమస్యలతో సతమతమవుతోన్న వాళ్లకి ఇక్కడి స్వామి కల్పవృక్షం వంటివారని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. 'మట్టపల్లి'లో స్వామి దర్శనం చేసుకున్నవారు దర్శన ఫలాన్ని పొందకుండా తిరిగివెళ్లరనడానికి నిదర్శనంగా స్వామివారి మహిమలు ఇక్కడ కథలు .. కథలుగా వినిపిస్తూ ఉంటాయి.