దేవాలయంలో ప్రదక్షిణ నియమం
దేవాలయంలోకి అడుగుపెట్టగానే భక్తులు ప్రశాంతతను పొందుతారు. తమ మనసులోని కష్టనష్టాలను భగవంతుడికి చెప్పుకుని ఊరట చెందుతారు. దేవాలయానికి వెళ్లినవారు ప్రధాన దైవానికి నమస్కరించుకుని ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే ప్రదక్షిణలు చేసేవారు ఒక నియమాన్ని తప్పకుండా పాటించవలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
ప్రధాన దైవానికి ఎదురుగా, ఆ దైవానికి సంబంధించిన వాహనం కూడా ప్రతిష్ఠించబడి ఉంటుంది. శ్రీ మహా విష్ణువుకి ఎదురుగా గరుత్మంతుడు .. పరమశివుడికి ఎదురుగా నంది .. శ్రీరాముడికి ఎదురుగా హనుమంతుడు .. వినాయకుడికి ఎదురుగా మూషికం .. కుమారస్వామికి ఎదురుగా నెమలి .. అమ్మవారికి ఎదురుగా సింహవానం దర్శనమిస్తుంటాయి. దైవానికి .. ఆ దైవానికి సంబంధించిన వాహనానికి మధ్యలో నుంచి ప్రదక్షిణలు చేయకూడదు.
దైవానికి పరమ భక్తులుగా .. సేవకులుగా వుండే ఆ వాహనాలు తదేకంగా దైవాన్నే చూస్తుంటాయి. వాటికి స్వామివారు కనిపించకుండా అడ్డుగా నిలవడం వలన దోషం కలుగుతుందనేది మహర్షుల మాట. అందువలన దైవానికి .. వాహనానికి మధ్యలో నడవకుండా, రెండింటిని కలుపుకుని ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది. ఇక ప్రదక్షిణలు ఎప్పుడూ నిదానంగా చేయాలి .. కాలి మడిమలతో ఎక్కువ శబ్దం చేయకుండా ప్రదక్షిణ చేయాలనే నియమాన్ని మరిచిపోకూడదు.