స్వప్నంలో హెచ్చరించిన చెన్నకేశవస్వామి

చెన్నకేశవస్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలలో 'కోగిలవాయి' ఒకటిగా కనిపిస్తుంది. వరంగల్ జిల్లా కేంద్రానికి సమీపంలోగల ఈ క్షేత్రంలో స్వామివారు కొండపై ఆవిర్భవించాడు. ఇక్కడి కొండల వరసలో స్వామివారు వెలసిన కొండ మరింత ఎత్తుగా దర్శనమిస్తూ ఉంటుంది. కొండపై కొన్ని నీటి గుండాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి చాలా మహిమాన్వితమైనవని చెబుతారు. స్వామివారు వెలసిన ప్రదేశంలో కొండ చీలినట్టుగా కనిపిస్తుంది.

కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొండరాళ్లను పేల్చివేసి ఆ బండరాళ్లను వాడటానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడట. కొండపై కొన్ని ప్రదేశాల్లో రంధ్రాలు కూడా చేశారు. మరుసటి రోజు ఆ రంధ్రాల్లో మందుగుండు పెట్టి పేల్చాలనే ఉద్దేశంతో ఇళ్లకి వెళ్లారు. ఆ రాత్రి ఆ వ్యక్తికి స్వప్నంలో స్వామివారు కనిపించి, ఆ కొండ మొత్తం తన నివాస ప్రాంతమేనని చెప్పాడట. ఆ కొండను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించవద్దని హెచ్చరించాడట. దాంతో ఆ వ్యక్తి ఆ ప్రయతాన్ని విరమించుకున్నట్టుగా చెబుతారు. ఇప్పటికీ కొండపై అలా ఖాళీగా వదిలేసిన రంధ్రాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తుంటాయి.


More Bhakti News