మారుమూల క్షేత్రంలో అనంతపద్మనాభుడు
సూర్యాపేట జిల్లా పరిధిలోని ప్రాచీన క్షేత్రాల్లో 'బూరుగుగడ్డ' ఒకటి. పూర్వం ఈ ప్రదేశంలో భృగు మహర్షి తపస్సు చేసుకోవడం వలన, ఆయన పేరుతోనే ఈ గ్రామం ఏర్పడిందని అంటారు. ఈ క్షేత్రంలో ఆదివరహ లక్ష్మినరసింహ వేణుగోపాలస్వామి ఒకే వేదికపై కొలువై ఉండటం విశేషం. ఈ క్షేత్రంలో 20 అడుగుల అనంతపద్మనాభస్వామి మూర్తి ఏకశిలతో మలచబడి ఉంటుంది.
ముఖమంటపంలోని ఒక వైపున ఈ మూర్తి దర్శనమిస్తుంది. అనంతపద్మనాభస్వామి మూర్తిని ఎవరు మలిచారనేది తెలియదు. ఆ మూర్తిని ఎలా ఆ మంటపంలోకి తరలించారనేది తెలియదు. ఇక్కడి పారిజాత వృక్షం కొన్ని వందల సంవత్సరాలుగా స్వామివారికి పుష్పాలను అందిస్తూనే ఉందని చెబుతారు. ఇక్కడి వేణుగోపాలుడు కుదురుగా దర్శనమిస్తూ ఉండగా, గోదాదేవి అమ్మవారు ఆరు అడుగుల ఎత్తుతో కనిపిస్తూ ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఇలా అనేక విశేషాలను సంతరించుకున్న ఈ ఆలయం ప్రాచీన వైభవంతో వెలుగొందుతోంది.