అనంతుడిని .. నారదుడిని అనుగ్రహించిన స్వామి
పంచ భావనారాయణస్వామి క్షేత్రాలలో 'సర్పవరం' ఒకటి. కాకినాడకి సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా ప్రధాన దైవానికి సంబంధించిన మూలమూర్తి ఒకటి మాత్రమే కనిపిస్తుంది. కానీ సర్పవరంలో మాత్రం భావనారాయణస్వామి మూలమూర్తులు రెండు కనిపిస్తాయి. ఒక మూర్తి పాతాళ భావనారాయణస్వామిగా .. మరో మూర్తి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామిగా దర్శనమిస్తారు.
ప్రదక్షిణ మార్గంలో పాతాళ భావనారాయణస్వామి .. ముఖమంటపంతో కూడిన గర్భాలయంలో రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి పూజలు అందుకుంటూ వుంటారు. అనంతుడిని అనుగ్రహించడానికి పాతాళ భవనారాయణస్వామి ఆవిర్భవించగా, తనకి స్త్రీ రూపాన్ని తొలగించినందుకుగాను నారదుడు రాజ్యలక్ష్మి సమేత భావనారాయణుడిని ప్రతిష్ఠించాడు. 'పిఠాపురం' రాజావారు నిర్మించిన గాలి గోపురం ఈ క్షేత వైభవానికి అద్దంపడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో అడుగుపెట్టినవారిని ధన్యులను చేస్తుంటుంది.