విశేషాల సమాహారం వాడపల్లి
శివ కేశవులు కొలువైన క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవిగా భక్తులు భావిస్తుంటారు. అలా శివకేశవులు వెలసిన పరమ పవిత్రమైన క్షేత్రంగా 'వాడపల్లి' దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఈ క్షేత్రం అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది. ఈ క్షేత్రం కృష్ణానది .. మూసినది సంగమ స్థానం. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి .. శివలింగం రెండూ అగస్త్యుడు ప్రతిష్ఠించాడు.
లక్ష్మీనరసింహస్వామి మూర్తి 'నాసిక'కి ఎదురుగా గల దీపం స్వామివారి శ్వాస ప్రక్రియకి తగినట్టుగా రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ పక్కనే గల మరో దీపం మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా వున్నారని చెబుతారు. ఇక ఇక్కడి శివలింగం తల పైభాగంలో నిరంతరం నీరు ఊరుతుంటుంది. శివలింగం తలపై భాగంలోని రంధ్రము ఎంతవరకూ వుందో తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఆది శంకరులవారు, అది స్వామివారి మహిమగా తేల్చడం మరో విశేషం. కార్తీకమాసంలో ఇక్కడి నదీ సంగమ స్థానంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు.