కొండపై వెలసిన లక్ష్మీ నరసింహుడు
లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో 'పెరుమాళ్ల సంకీస' ఒకటిగా కనిపిస్తుంది. ఖమ్మం సమీపంలో గల ఈ క్షేత్రంలో ప్రాచీనకాలంనాటి రామాలయం వుంది. ఎత్తైన గాలిగోపురంతో .. విశాలమైన ప్రాంగణంతో కనిపించే ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతిబింబంలా అనిపిస్తుంది. ఈ గ్రామంలో నుంచి కొంత దూరం వెళితే, లక్ష్మీనరసింహస్వామి కొలువైన ఎత్తైన గుట్ట కనిపిస్తుంది. గుట్టపై గల 'గుహ'లో స్వామివారు ఆవిర్భవించారు.
పూర్వం 'మేడూరి' వంశానికి చెందిన ఒక అర్చక స్వామికి నరసింహస్వామి స్వప్న దర్శనమిచ్చి, ఇక్కడ వెలసినట్టు చెప్పాడట. అప్పటి నుంచి నిత్యపూజలు జరపడం మొదలైందని అంటారు. ఈ గుట్టపై సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరును చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కోనేరు నీటి స్వచ్ఛతను కాపాడుతూ రెండు బండరాళ్లతో సహజ సిద్ధంగా ఏర్పడిన పైకప్పు విస్మయులను చేస్తుంది. మహిమాన్వితమైన ఈ కోనేరు నీటిని తీర్థంగా స్వీకరించడం వలన, వ్యాధులు - బాధలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.