కొండరాళ్ల మధ్య వెలసిన నారసింహుడు
నరసింహస్వామి తన అవతార రహస్యానికి తగినట్టుగానే కొండలపైగల గుహల్లో ఎక్కువగా వెలుస్తుంటాడు. లక్ష్మీ సమేతుడై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. తన కొండనెక్కి వచ్చిన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అలా ఆ స్వామి వెలసిన క్షేత్రాల్లో ఒకటిగా నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలోని 'చలిదోన' కనిపిస్తుంది. ఇక్కడి కొండపై గల పెద్ద బండరాళ్ల మధ్యలో స్వామివారు వెలిశాడు.
కొండపైగల స్వామివారిని చేరుకోవడానికి మెట్ల మార్గం వుంది. కొండరాళ్ల మధ్య వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే భక్తులు బాగా వంగుతూ వెళ్లవలసి ఉంటుంది. అర్చక స్వామి కూడా అలాగే వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహిస్తాడు. ఇంత ఎత్తైన కొండపై కోనేరు ఉండటం విశేషం. ఇక్కడి కొండపై నుంచి చూస్తే పచ్చని పొలాలు .. ఎత్తైన గుట్టలతో ప్రకృతి పరవశింపజేస్తుంది. ప్రతి శనివారం స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సంతానలేమితో బాధపడేవారు, ఈ స్వామిని దర్శించడం వలన సంతానాన్ని పొందుతారని భక్తులు విశ్వసిస్తుంటారు.