లక్ష్మీనారసింహుడి కల్యాణోత్సవం
గోదావరి జిల్లాల్లోని పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా 'ఊడిమూడి' లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కనిపిస్తుంది. రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. వయా గంటి - పెదపూడి మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చును. వశిష్ఠ గోదావరి తీరంలోని ఒక పుట్టలో నుంచి బయటపడిన మూర్తి ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటోంది. స్వామివారి గర్భాలయం పక్కనేగల మందిరంలో జ్వాలా నరసింహస్వామి కూడా కొలువై వుంటాడు.
ప్రతియేటా 'భీష్మ ఏకాదశి' రోజున స్వామివారికి కల్యాణోత్సవం జరుగుతుంటుంది. వచ్చేనెల 5వ తేదీన స్వామివారి కల్యాణం వైభవంగా జరగనుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించిన భక్తులకు సకల శుభాలు చేకూరతాయనేది భక్తుల విశ్వాసం. అదే రోజున జరగనున్న అంతర్వేది తీర్థానికి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివెళతారు.