వ్యాధులను నివారించు వేంకటేశ్వరుడు

వేంకటేశ్వరస్వామి తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. అలా ఆ స్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో 'నేలకొండపల్లి' ఒకటిగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సెంటర్ నుంచి బౌద్ధ స్థూపానికి వెళ్లే మార్గంలో స్వామివారి ఆలయం దర్శనమిస్తుంది. స్వామివారు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం ఇక్కడ ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. కుష్ఠు వ్యాధితో తాను పడుతున్న బాధల నుంచి విముక్తుడిని చేయమని వేంకటేశ్వరస్వామిని కోరుతూనే ఆయన తన తపస్సును కొనసాగించేవాడట. ఓ రోజు రాత్రి స్వప్నంలో ఆ సాధువుకు స్వామి దర్శనమిచ్చి కుష్ఠు వ్యాధి నుంచి ఆయనను విముక్తుడిని చేస్తున్నట్టుగా చెప్పడమే కాకుండా, 'తిరునామం' రూపంలో తను వెలస్తున్నట్టుగా సెలవిచ్చాడట. ఉదయాన్నే తనని తాను చూసుకున్న ఆ సాధువు, తనకి కుష్ఠు వ్యాధి ఆనవాళ్లు కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడట. ఆ తరువాత ఒక కొండ గుహలో స్వామివారు వెలసినట్టుగా గమనించి, నిత్యపూజలు నిర్వహించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఇక్కడి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న వారికి వ్యాధుల నుంచి .. బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News