అమ్మపేట ఆలయం ప్రత్యేకత
వేంకటేశ్వరస్వామి వెలసిన క్షేత్రాలలో 'అమ్మపేట' ఒకటిగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పరిధిలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. 'అమ్మపేట' ఊళ్లోకి వెళుతుండగా పంటపొలాల మధ్యలోని కొండపై స్వామి కొలువయ్యాడు. విశాలమైన పైకప్పు కలిగిన పెద్ద బండరాయి కింద స్వామి వెల్లకిల పడుకుని వెలవడం ఈ క్షేత్రం ప్రత్యేకత. స్వామివారి రూపం ఆరు అడుగులపైనే ఉంటుంది.
సాధారణంగా కొండ అనగానే చిన్న .. పెద్ద రాళ్లు కలిపి ఉంటాయి. కానీ ఈ కొండపై ఓ మాదిరి రాళ్లు అసలు కనిపించవు. విశాలమైన .. పొడవైన రాళ్లతో ఈ కొండ ఏర్పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రవేశ ద్వారానికి రెండు వైపులా కూడా ప్రహరీ నిర్మించినట్టుగా పొడవైన రాళ్లు ఉండటం విశేషం. ఇక ఒక రాయి మహా లింగాన్ని తలపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. శివకేశవులిద్దరూ ఈ కొండపైనే కొలువయ్యారా అనిపించకమానదు. స్వామివారు విహారించేదిగా చెప్పబడే శిలా విమానం ఇక్కడి మరో విశేషం. రామాయణ కాలంలో సీతారాములు ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టుగా చెబుతారు .. సీతమ్మవారి పాదాల ముద్రలను చూపుతారు. ఇన్ని విశేషాలను సంతరించుకున్న ఈ క్షేత్రంలో, స్వామివారిని వెలిగొండ వేంకటేశ్వరుడిగా భక్తులు పూజిస్తుంటారు.