శివరాత్రి రోజున అభిషేకాలు .. ఫలితాలు
'ఓం నమఃశివాయ' అనే శివ పంచాక్షరీ మంత్రంలోని 'న' అనే అక్షరం బ్రహ్మను .. భూమినీ, 'మ' అనే అక్షరం విష్ణువును .. జలాన్నీ, 'శి' అనే అక్షరం రుద్రుడిని .. అగ్నినీ, 'వా' అనే అక్షరం మహేశ్వరుడుని .. వాయువుని 'య' అనే అక్షరం సదా శివుడిని .. ఆకాశాన్ని సూచిస్తుంది. ఓం కారంతో కూడిన శివ తత్త్వమే ఈ సృష్టికి మూలం. అలాంటి పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ శివరాత్రి రోజున స్వామిని అభిషేకించాలి.
పాలతో అభిషేకించడం వలన దుఃఖం దూరమవుతుంది. పెరుగుతో అభిషేకించడం వలన ఆరోగ్యం లభిస్తుంది. నెయ్యితో అభిషేకించడం వలన, గుణవంతులైన సంతానం కలుగుతుంది. తేనెతో అభిషేకించడం వలన తేజస్సు పెరుగుతుంది. పంచదారతో అభిషేకించడం వలన బుద్ధి వికాసం కలుగుతుంది. బిల్వదళాలతో అభిషేకం భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. నేరేడుపళ్ల రసంతో చేసే అభిషేకం వలన విజయాలు చేకూరతాయి. పుష్ప జలంతో చేసే అభిషేకం వలన భూలాభం కలుగుతుంది. ఇలా శివరాత్రి రోజున శివయ్యకి చేసే అభిషేకాల వలన, అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.