వివిధ రకాల శివలింగాలు .. పూజాభిషేకాల ఫలితాలు
పరమశివుడు తన భక్తులను అనుగ్రహించడానికీ, ముక్తి మార్గంలో వాళ్లను నడిపించడానికి ఇచ్చిన అవకాశమే మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున ఉదయం .. మధ్యాహ్నం .. రాత్రి మూడు పూటలా శాస్త్రోకంగా శివపూజ చేయాలి. ఈ రోజున వివిధ రకాల శివలింగాలకు పూజాభిషేకాలు నిర్వహించడం వలన, వివిధ రకాల ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
ఈ రోజున బంగారంతో చేసిన శివలింగాన్ని పూజించడం వలన సిరిసంపదలు చేకూరతాయి. వెండి శివలింగాన్ని ఆరాధించినందు వలన ధనధాన్యాలు లభిస్తాయి. ఇత్తడితో చేసిన శివలింగాన్ని ఆరాధించడం వలన దారిద్య్రంతో కూడిన దుఃఖం దూరమవుతుంది. ఇక మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలనుకునేవారు, స్పటిక శివలింగాన్ని పూజించాలి. పాదరసంతో చేయబడిన శివలింగాన్ని పూజించడం వలన, ముల్లోకాల్లోని శివలింగాలన్నింటికీ పూజాభిషేకాలు జరిపిన ఫలితం లభిస్తుందట. పాదరస శివలింగ ఆరాధన వలన సమస్త పాపాలు నశించి, సంపూర్ణ సుఖాలు చేకూరతాయనేది మహర్షుల మాట.