భగవంతుడిని చేరుకునే మార్గమే దానం
ఎలా సంపాదిస్తేనేం .. సంపాదించడమే ముఖ్యమని కొందరు భావిస్తారు. అలా సంపాదించిన దానిలో కొంత దానం చేస్తూనే వున్నాం కదా అనుకుంటారు. అలా దానం చేయడం వలన పాపమేదైనా వుంటే కొంతవరకూ నశిస్తుందనీ, పైగా పుణ్యరాశి పెరుగుతుందని భావిస్తారు. కానీ ఇలాంటి దానాలు చేయడం వలన పుణ్యరాశి ఎంతమాత్రం పెరగదని శాస్త్రాలు చెబుతున్నాయి.
'దానం' అంటే ఇవ్వడం అని అర్థం. భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత ఇతరులకి సాయం చేయాలి. అలా చేసే దానం .. మనం ధర్మబద్ధంగా సంపాదించినదై ఉండాలి. అవతలవారు ఆపదలో వున్నప్పుడు, ధర్మబద్ధమైన ధనాన్ని దానంగా ఇవ్వడం వల్లనే అది నిజమైన దానం అవుతుంది. అలాంటి దానం వల్లనే పుణ్యరాశి పెరుగుతుంది. దానగుణమంత గొప్పది ఏదీ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక బీజం నాటితే అది ఎన్నో ఫలాలను ఇచ్చినట్టుగా, దానం కూడా అనేక రెట్ల ఫలాలను ఇస్తుందని స్పష్టం చేస్తున్నాయి. భగవంతుడిని చేరుకోవడానికీ .. పరలోకంలో ఉత్తమగతులు కలగడానికి దానానికి మించిన మార్గం లేదనేది మహర్షుల మాట. కర్ణుడు .. శిబి చక్రవర్తి .. బలి చక్రవర్తి వంటి వారెందరో, దాన గుణం వల్లనే శాశ్వతమైన కీర్తిని సంపాదించుకున్నారు.