విజయాన్ని ప్రసాదించే వెన్నవరం శ్రీరాముడు
శ్రీరామచంద్రుడు కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా 'వెన్నవరం' కనిపిస్తుంది. వరంగల్ జిల్లా .. డోర్నకల్ మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. వెన్నవరంలో .. వెలసిన వేంకటేశ్వరస్వామి వున్నాడు. స్వామి మహిమాన్వితుడని భక్తులు విశ్వసిస్తుంటారు. అక్కడికి చాలా దగ్గరలోనే సీతారామాలయం వుంది. కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది.
కాంపల్లి అప్పయ్య అనే ఒక భక్తుడికి స్వప్నంలో స్వామివారు కనిపించి, తనకి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు జరిగేలా చూడమని ఆదేశించాడట. దాంతో ఆయన గ్రామస్థులకు ఆ విషయాన్ని తెలియజేసి, వాళ్లందరి సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడట. సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఎత్తైన గోపురం .. పొడవైన ప్రాకారాలు .. సుందరంగా తీర్చిదిద్దబడిన ముఖమంటపం ఆలయ వైభవానికి అద్దం పడుతుంటాయి.
గర్భాలయంలో సీతారామలక్ష్మణులు కొలువుదీరి ఉండగా, క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు దర్శనమిస్తాడు. 'శ్రీరామనవమి' రోజున స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆలయం వెలుపల గల ప్రత్యేక మంటపంలో జరిగే కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన, తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.