సుదర్శన చక్రత్తాళ్వార్
దుష్ట శిక్షణ .. శిష్ట రక్షణ కోసం శ్రీమహా విష్ణువు అనేక అవతారాలను ధరించాడు. లోక కల్యాణం కోసం స్వామివారు అవతరిస్తున్నప్పుడల్లా, ఆయన ఆజ్ఞను పాటించడానికి సుదర్శన చక్రత్తాళ్వార్ కూడా వెన్నంటే వున్నాడు. ఒక్కో అవతారంలో మానుష రూపంలోనూ .. ఒక్కో సమయంలో ఆయుధ రూపంలోను ఆయన స్వామి ఆదేశాలను పాటిస్తూ వచ్చాడు.
శ్రీమహా విష్ణువు .. రామావతారాన్ని ధరించినప్పుడు, ఆయన తమ్ముడు భరతుడిగా సుదర్శన చక్రత్తాళ్వార్ అవతరించాడు. కృష్ణావతారంలో సుదర్శనుడుగానే స్వామిని అంటిపెట్టుకుని వున్నాడు. పరశురామావతారంలో 'గొడ్డలి'గా అవతరించాడు. నరసింహ స్వామి అవతారంలో ఆ స్వామి 'గోళ్లు'గా ఆవిర్భవించాడు. ఇలా స్వామివారు ఆయా అవతారాలను ధరిస్తూ ఉండగా, ఆ అవతారాల్లో స్వామివారు అప్పగించే బాధ్యతలను సుదర్శనుడు నెరవేరుస్తుంటాడు. లోక కళ్యాణం కోసం స్వామివారు తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేయడంలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటాడు.