వారణాసిలో సాంబకుండం ప్రత్యేకత
సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజించే ఆచారం అనాదిగా వుంది. సూర్యభగవానుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కాశీ క్షేత్రంలో ద్వాదశాదిత్య ఆలయాలు అనే పేరుతో పన్నెండు సూర్య దేవాలయాలు వున్నాయి. ఈ దేవాలయాలు అత్యంత ప్రాచీనమైనవనే విషయం స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది.
వారణాసిలోని సూర్య కుండం సమీపంలో సాంబాదిత్యుని ఆలయం కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు - జాంబవతి సంతానమే ఈ సాంబుడు. నారద మహర్షిని అవమానపరిచిన సాంబుడిపై శ్రీకృష్ణుడు ఆగ్రహిస్తాడు. కుష్ఠు వ్యాధితో బాధపడమని శపిస్తాడు. ఆ తరువాత శాంతించి .. కాశీ క్షేత్రానికి వెళ్లి సూర్యుడిని ఆరాధిస్తే శాప విమోచనం కలుగుతుందని సెలవిస్తాడు. దాంతో సాంబుడు కాశీ క్షేత్రానికి చేరుకొని సాంబకుండాన్ని నిర్మించుకుని అందులో స్నానమాచరిస్తూ సూర్యారాధన చేస్తాడు. దాంతో సూర్యానుగ్రహం కారణంగా ఆయన కుష్ఠు వ్యాధి తగ్గుతుంది. ఇక్కడి సాంబకుండంలో స్నానమాచరించడం వలన, కుష్ఠు వ్యాధి తగ్గుతుందనే బలమైన విశ్వసం ఇప్పటికీ వుంది.