పాపాల నుంచి విముక్తులను చేసే యమాదిత్యుడు
కాశీ క్షేత్రానికి వెళ్లిన భక్తులు, అక్కడి యమాదిత్యుడిని కూడా దర్శించుకోవాలి. మంగళవారంతో కూడిన చతుర్దశి రోజున గంగానదిలో స్నానమాచరించి, యమాదిత్యుడిని దర్శించుకున్నవారు, సమస్త పాపాల నుంచి విముక్తులవుతారని స్థలపురాణం చెబుతోంది. ఒకసారి యమధర్మరాజు తన భటులను పిలిచి, శ్రీమహావిష్ణువును అనునిత్యం ఆరాధించే మహా భక్తుల జోలికి వెళ్లొద్దని చెప్పాడట.
అయినా ఆ భటులు సూర్య భగవానుడి భక్తుడైన సత్రాజిత్తు దగ్గరికి వెళ్లి, ఆ స్వామి ఆగ్రహానికి గురవుతారు. విషయం తెలుసుకున్న యమధర్మరాజు, వాళ్ల అపరాధాన్ని మన్నించమని సూర్యభగవానుడిని కోరుతూ ఆయన మూర్తిని కాశీ క్షేత్రంలో ప్రతిష్ఠిస్తాడు. ఆ స్వామిని సేవిస్తూ ఆయన అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అందువల్లనే ఇక్కడి సూర్యభగవానుడు యమాదిత్యుడుగా పూజలు అందుకుంటున్నాడు. ఆ స్వామి దర్శనం చేసుకున్నవారు, యమ యాతనలను అనుభవించవలసి అవసరం లేదనేది మహర్షుల మాట.