కాశీలో వృద్ధాదిత్యుడు
కాశీ క్షేత్రంలో చూడదగిన ఆలయాలలో సూర్య దేవాలయాలు కూడా ప్రముఖంగా కనిపిస్తాయి. సూర్యభగవానుడు కొలువైన 12 దేవాలయాలు విశేషమైనవిగా స్థలపురాణం చెబుతోంది. అలా కొలువై పూజలు అందుకునే ఆదిత్యులలో, వృద్ధాదిత్యుడు ఒకరుగా కనిపిస్తాడు. పూర్వం 'హారితుడు' అనే భక్తుడు అనునిత్యం సూర్యభగవానుడిని పూజిస్తూ వచ్చాడట.
వృద్ధుడు అయిన అతనికి ఇంకా సూర్యభగవానుడిని ఆరాధనలో సంతృప్తి లభించలేదు. దాంతో యవ్వనాన్ని ప్రసాదించమని ఆ స్వామిని వేడుకున్నాడు. అందుకోసం కఠోర తపస్సు చేశాడు. సూర్యభగవానుడు ఆ భక్తుడి తపస్సుకు మెచ్చి, ప్రత్యక్షమవుతాడు. తనని పూజించేందుకుగాను యవ్వనాన్ని ప్రసాదిస్తాడు. వృద్ధుడిచేత పూజించబడిన ఆదిత్యుడు గనుక, వృద్ధాదిత్యుడు పేరుతో పిలవబడుతున్నాడు. వృద్ధాదిత్యుడిని దర్శించుకున్నవారి వ్యాధులు .. బాధలు నశిస్తాయని స్థలపురాణం చెబుతోంది. కోరిన కోరికలు నెరవేరుతాయని సెలవిస్తున్నాయి.