వారణాసిలో గంగాదిత్యుడు

కాశీ క్షేత్రం అనేక విశేషాలను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టడమే పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తుంటారు. ఇక్కడ చూడదగిన ప్రదేశాలలో సూర్య దేవాలయాలు కూడా కనిపిస్తాయి. ఒక్కో ఆలయంలోని సూర్యభగవానుడు ఒక్కో పేరుతో పిలబడుతూ ఉంటాడు. అలా సూర్యదేవుడు 'గంగాదిత్యుడు' అనే పేరుతో ఇక్కడ దర్శనమిస్తుంటాడు. ఇక్కడి 'లలితా ఘట్టం'లో స్వామి ఆలయం కనిపిస్తుంది.

అంశుమంతుడు ఆయన కుమారుడు దిలీపుడు గంగను భూలోకానికి తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. చివరికి దిలీపుడు కుమారుడైన భగీరథుడు .. గంగను భూలోకానికి తీసుకొస్తాడు. తన వంశంలోని భగీరథుడు చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందించిన సూర్యభగవానుడు, ఇక్కడే గంగాదేవిని స్తుతిస్తాడు. ఆ ప్రదేశంలోనే స్వామివారు 'గంగాదిత్యుడు' పేరుతో పిలవబడుతూ పూజలు అందుకుంటున్నాడు. స్వామివారి దర్శనం వలన సమస్త పాపాలు నశిస్తాయని స్థల పురాణం చెబుతోంది.  

More Bhakti Articles