శని దేవుడిని శాంతింపజేసే శివాభిషేకం
సాధారణంగా శనిదేవుడి పేరు వినగానే .. ఆయన రూపాన్ని చూడగానే ఆందోళన చెందడం జరుగుతూ ఉంటుంది. శనిదేవుడు అనేక కష్టనష్టాలకు గురిచేస్తాడనే విషయాన్ని ఎప్పటి నుంచో .. ఎందరి నుంచో విని ఉండటమే అందుకు కారణం. కానీ నిజానికి శని దేవుడు న్యాయాధికారిగా వ్యవహరిస్తాడు. అన్యాయంగా .. అధర్మంగా ఆయన ఎవరినీ బాధించడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఆయా వ్యక్తుల కర్మ ఫలితాలను అనుభవించేలా చేస్తాడు.
శనిదేవుడికి ప్రీతికరమైన పనులను చేయడం వలన, ఆయన తీవ్రత నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆయన అనుగ్రహం కలిగితే పూర్తిస్థాయిలో శాంతిస్తాడు. శనిదేవుడికి ప్రీతికరమైన వాటిలో శివారాధన ఒకటిగా కనిపిస్తుంది. అనునిత్యం శివలింగానికి అభిషేకం నిర్వహించి, పూజించేవారిపట్ల ఆయన తన అనుగ్రహాన్ని చూపుతాడు. అందువలన శివలింగానికి నిత్యం అభిషేకం చేసి, ఆయన ప్రభావం నుంచి బయటపడొచ్చనేది మహర్షుల మాట.