ఆధ్యాత్మికంగా ఐదు ప్రాముఖ్యత
ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే 'ఐదు' అనే అంకెకి ఎంతో ప్రాముఖ్యత వుంది. నింగి .. నేల .. నీరు .. నిప్పు .. గాలి పంచ భూతాలుగా చెప్పబడ్డాయి. పృథివీ లింగం .. ఆకాశ లింగం .. జల లింగం .. వాయు లింగం .. తేజో లింగం పంచలింగాలుగా చెబుతారు. పరమ శివుడు .. పార్వతీదేవి .. చండికేశ్వరుడు .. గణపతి .. సుబ్రహ్మణ్య స్వామిని శైవ క్షేత్రాలలో పంచ మూర్తులని అంటారు.
దేవ యజ్ఞం .. పితృ యజ్ఞం .. భూత యజ్ఞం .. మానుష యజ్ఞం .. బ్రహ్మ యజ్ఞం .. పంచ యజ్ఞాలని చెబుతారు. గణపతి హోమం .. సుదర్శన హోమం .. రుద్ర హోమం .. చండీ హోమం .. నవగ్రహ హోమం అనేవి పంచ హోమాలుగా పేర్కొన్నారు. కర్మయాగం .. తపయాగం .. జప యాగం .. ధ్యాన యాగం .. మంత్ర యాగం .. పంచ యాగాలని అంటారు. ప్రాణ .. అపాన .. వ్యాన .. సమాన .. ఉదానాలు ..పంచ ప్రాణాలుగా చెప్పబడ్డాయి. ఇలా ఐదు అనే అంకెలో ఆధ్యాత్మిక పరమైన అంశాలు ఎన్నో ఇమిడిపోయి కనిపిస్తాయి.