పుట్టమన్నుతో ఏర్పడిన శివలింగం

పరమశివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో 'తిరుక్కరుగావూర్' ఒకటిగా కనిపిస్తుంది. తమిళనాడు .. తంజావూరులో పాపనాశనం తాలూక పరిథిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడి స్వామిని ముల్లైవనాథర్ అనీ .. అమ్మవారిని గర్భ రక్షామ్బిక అని పిలుస్తారు. స్వామివారు ఇక్కడ స్వయంభువు .. పుట్టమన్నుతో ఏర్పడిన శివలింగం. ఈ కారణంగానే ఇక్కడి శివలింగానికి జలంతో కాకుండా పుష్పాలతో అభిషేకం చేస్తారు.

శైవ మహా భక్తులైన అప్పర్ .. సుందరార్ .. జ్ఞాన సంబంధర్ ఇక్కడి స్వామివారిని కీర్తించారు. స్వామివారి దర్శనం వలన చర్మ సంబంధమైన వ్యాధులు తగ్గిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడి అమ్మవారు 7 అడుగుల ఎత్తును కలిగి ఉండటం విశేషం. అమ్మవారి అలంకారం చూసి తీరవలసిందేనని అంటారు. సంతానాన్ని ప్రసాదించడం .. గర్భవతులను రక్షించడం అమ్మవారి ప్రత్యేకత అని చెబుతారు. వేయి సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయంలో అడుగుపెట్టడంతోనే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. పార్వతీ పరమేశ్వరుల లీలా విశేషాలు భక్తుల అనుభవాలుగా ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి.  


More Bhakti News