అల్లపర్రు దేవుడి చెరువు
శ్రీ భూ నీళా సమేత చెన్నకేశవస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో 'అల్లపర్రు' ఒకటిగా కనిపిస్తుంది. 'అల్లపర్రు' గ్రామస్తులు మంచినీటి కోసం చెరువు తవ్వుతుండగా, శ్రీ చెన్నకేశవమూర్తి శిలా ప్రతిమ బయటపడిందట. ఆ మూర్తిని చెరువు కట్టపై ఉంచి పూజించడం మొదలుపెట్టారట. అయితే ఆ పక్కనేగల 'ఉల్లిపాలెం' గ్రామానికి చెందిన జమీందారుకు కలలో స్వామి కనిపించి, 'ఉల్లిపాలెం'లో తనకి ఆలయం నిర్మించి నిత్య పూజలు జరిగేలా చూడమని ఆదేశించాడట.
సాధారణమైన కల అనుకుని ఆ జమీందారు పట్టించుకోకపోవడంతో, మళ్లీ కలలో స్వామి కనిపించి అంతకు ముందులానే సెలవిచ్చాడట. దాంతో 'అల్లపర్రు' గ్రామస్తులకు విషయం చెప్పి, ఆ మూర్తిని తీసుకొచ్చి 'ఉల్లిపాలెం' ఆలయంలో ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఇప్పటికీ అల్లపర్రుకి ఊరేగింపుగా వచ్చి కాసేపు కొలువు చేసి వెళుతుంటాడు. ఇక్కడి స్వామివారు మహిమాన్వితుడని ఇరుగ్రామాల ప్రజలు భావిస్తుంటారు. స్వామివారి దర్శన మాత్రం చేతనే ఆపదలు తొలగిపోతాయని, విజయాలు చేకూరతాయని విశ్వసిస్తుంటారు. ఇప్పటికీ స్వామివారి మూర్తి బయటపడిన 'అల్లపర్రు' చెరువు .. 'దేవుడి చెరువు'గానే పిలవబడుతుండటం విశేషం.