వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
శ్రీమహావిష్ణువు ఆవిర్భవించిన 108 దివ్య తిరుపతులు ఎంతో మహిమాన్వితమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రాలలో ఒకటిగా 'నిచుళాపురి' దర్శనమిస్తుంది. 'తిరుచ్చి' సమీపంలో వెలుగొందుతున్న ఈ క్షేత్రంలో స్వామివారు అళగియ మనవాళ పెరుమాళ్ పేరుతోనూ .. అమ్మవారు వాసలక్ష్మీ పేరుతో పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి 'కల్యాణ తీర్థం' పరమ పవిత్రమైనదిగా చెబుతారు.
పూర్వం ధర్మవర్మ అనే రాజుకు స్వామివారు దర్శనం ఇచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ధర్మవర్మ తన భార్య నిచుళాదేవి పేరుతో ఈ ఊరును నిర్మించాడు. ఈ దంపతుల గారాల కూతురు వాసలక్ష్మీ .. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ అవతారమని స్థల పురాణం చెబుతోంది. శ్రీరంగనాథుడిని ఆరాధించిన వాసలక్ష్మీ ఆ స్వామిని వివాహమాడింది. ఇక్కడ మీన మాసంలో శ్రీరంగనాథుడికి జరిగే బ్రహ్మోత్సవాల్లో 3 రోజున స్వామివారు వాసలక్ష్మీ సమేతుడై భక్తులను అనుగ్రహిస్తాడు. కులశేఖరాళ్వార్ ఇక్కడి స్వామివారిని కీర్తించాడు. ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరతాయి.