కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
108 దివ్య తిరుపతులలో ఒకటిగా కుంభకోణం ( తిరు కుడందై) కనిపిస్తూ ఉంటుంది. అనేక ఆలయాల సమాహారంగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. తమిళనాడులోని ఈ క్షేత్రంలో స్వామివారు శారంగపాణి పేరుతోను .. అమ్మవారు కోమలవల్లి తాయారు పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటున్నారు. ఇక్కడి గర్భగుడి రథం ఆకారాన్ని పోలివుండటం విశేషం. ఆలయానికి ఉత్తర వాకిలి .. దక్షిణ వాకిలి వున్నాయి. ఉత్తరాయణంలో ఉత్తర వాకిలిని తెరవడం మరో విశేషం.
పూర్వం సూర్యభగవానుడు సుదర్శన చక్రంతో పోటీపడి తన తేజస్సును కోల్పోయాడు. అప్పుడు ఆయన ఈ క్షేత్రంలో స్వామివారిని ఆరాధించి, స్వామి అనుగ్రహంతో తిరిగి తేజస్సును పొందాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రమనే పేరుతోను పిలుస్తుంటారు. సూర్యభగవానుడి అభ్యర్థన మేరకే శారంగపాణి ఇక్కడ ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ పాతాళ శ్రీనివాసుడి సన్నిధిని దర్శించి తీరవలసిందే. భూమికి 10 అడుగుల లోతున స్వామివారు కొలువై ఉంటాడు. పెరియాళ్వార్ .. పేయాళ్వార్ .. పూదత్తాళ్వార్ .. నమ్మాళ్వార్ .. ఆండాళ్ .. తిరుమంగై ఆళ్వార్ స్వామివారిని కీర్తించారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సమస్త పాపాలు నశించి .. సకల శుభాలు చేకూరతాయి.