ఏడుపాయలు
తెలంగాణ ప్రాంతంలో జరిగే జాతరలలో 'ఏడుపాయల జాతర'కు ఎంతో ప్రాధాన్యత వుంది. భారీ భక్త జన సందోహం నడుమ ఈ జాతర ఘనంగా జరుగుతుంది. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం మెదక్ జిల్లా సమీపంలో అలరారుతోంది. గోదావరికి ఉపనది అయిన మంజీరా నది ఇక్కడ ఏడు పాయలుగా చీలిపోయి ... ఆ తరువాత ఒక్కటిగా కలిసిపోతుంది.
అయితే ఈ ఏడు పాయల మధ్య ప్రదేశంలోని ఓ గుహలో 'దుర్గాదేవి' దర్శనమిస్తుంది. ఈ క్షేత్రం అరణ్య ప్రదేశంలో వెలిసిన కారణంగా ఇక్కడి అమ్మవారిని 'వనదుర్గ' గా భక్తులు భావిస్తుంటారు. ఏడు పాయలను అత్రి ... వశిష్ఠ ... కశ్యప ... విశ్వామిత్ర ... జమదగ్ని ... గౌతమి ... భరద్వాజ అనే సప్త ఋషులకు ప్రతీకగా చెప్పుకుంటారు.
మామూలు రోజుల్లో ఇక్కడ జనసంచారం కనిపించదు ... శివరాత్రి వచ్చిందంటే చాలు వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ సందర్భంగా పది రోజులపాటు ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుంది. పరవళ్లు తొక్కే ఏడుపాయలు ... పాపాలను కడిగేసే కనకదుర్గమ్మ ఎందరో కవుల హృదయాలను స్పందింపజేశాయి ... వారి కలాలను పరుగులు తీయించాయి.
పూర్వం జనమేజయ మహారాజు తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిని సమూలంగా నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఆయన 'సర్పయాగం'చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు. అందుకు నిదర్శనంగా ఈ పరిసరాల్లో ఇసుక మేటల కింద లభించే మెత్తటి బూడిదను చూపిస్తుంటారు.
సర్ప జాతులన్నీ సర్పయాగానికి ఆహుతి అవుతుండటంతో, వాటికి పుణ్యలోకాలు కల్పించడం కోసం గరుత్మంతుడు ... గంగను ఇక్కడికి తీసుకు వచ్చాడని అంటారు. ఈ కారణంగానే ఇక్కడి మంజీరాను 'గరుడ గంగ' అని పిలుస్తుంటారు. ఈ గంగలో భక్తులు స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబళ్లు చెల్లిస్తూ వుంటారు.