అమరలింగేశ్వర క్షేత్రం

ఇంద్రాది దేవతలు సైతం పరమశివుని పాదాల చెంత గడపాలని కోరుకుంటారు. ఆయనను వెదుక్కుంటూ వెళ్లి మరీ పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. అలా అటు దేవతల తోను ... ఇటు మానవులతోను పూజలందుకుంటోన్న శివ క్షేత్రం గుంటూరు జిల్లా గురజాల సమీపంలోని 'దైదా'లో కృష్ణానదీ తీరంలో దర్శనమిస్తుంది.

పరమశివుడు కొండ గుహలోని సొరంగ మార్గంలో వెలవడం ఇక్కడి ప్రత్యేకత. గుహలోకి నడచుకుంటూ వెళ్లే దారి ... లోపల హాయిగా కూర్చుని స్వామివారిని అభిషేకించే ప్రదేశం ... తిరిగి మరో దారిలో బయటికి వచ్చే ఏర్పాటు సహజ సిద్ధంగా ఏర్పడటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ... కశ్చితంగా దైవలీలే అనిపిస్తుంది.

పూర్వం ఈ కొండ గుహకి దగ్గరలో పశువుల కాపరులు పశువులను మేపుతుంటే, ఈ గుహలో నుంచి ఓంకారం అదే పనిగా వినిపిస్తూ ఉండటంతో లోపలికి వెళ్లి చూశారు. ఛాయా మాత్రంగా వున్న కొన్ని ఆకారాలు ఇక్కడి శివలింగాలను పూజించడం చూశారు. వారి అలికిడికి అక్కడి శక్తులు అదృశ్య మయ్యాయి. వారిని దేవతలుగా భావించిన స్థానికులు స్వామిని అమరలింగేశ్వరుడిగా ఆరాధిస్తున్నారు.

ఇప్పటికీ కూడా స్వామిని దేవతలు పూజించి వెళతారని అందుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయని అంటారు. ఆ సమయంలో గుహ అంతటా భూలోక వాసులు ఎరుగని పరిమళం వ్యాపిస్తుందని చెబుతుంటారు. ఇదే గుహలో అమ్మవారి మూర్తి కూడా కొలువై కనిపిస్తుంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇక్కడి స్వామివారిని చూసుకుని జీవిస్తున్న వారు ఎందరో వున్నారు. కష్ట నష్టాల్లో తమకి ఈ సదాశివుడు తోడుగా ఉంటాడనే భరోసా వారి మాటల్లో వినిపిస్తూ వుంటుంది.

కొండ గుహలోను ... భక్తుల గుండెల్లోను కొలువుదీరిన ఇక్కడి స్వామికి ప్రతి నిత్యం ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతూ వుంటుంది. కార్తీక .. మాఘ .. వైశాఖ మాసాల్లో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. మహా శివరాత్రి పర్వదినాన స్వామివారికి జరిగే కళ్యాణోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటూ వుంటారు.


More Bhakti News