ఏ నెలలో ఏ సూర్యుడు ?
ప్రత్యక్ష దైవంగా సూర్యుడు అటు దేవతలతోను ... ఇటు మానవాళితోను యుగయుగాలుగా పూజలందుకుంటున్నాడు. సూర్యనారాయణమూర్తికి అనేక రూపాలు ఉన్నప్పటికీ, వాటిలో 12 రూపాలు ఎంతో విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ధాత .. అర్యముడు .. మిత్రుడు .. వరుణుడు .. ఇంద్రుడు .. వివస్వంతుడు .. త్వష్టా .. విష్ణువు .. అంశుమంతుడు .. భగుడు .. పూషా .. పర్జన్యుడు అనే వీరే 'ద్వాదశాదిత్యులు'గా ప్రసిద్ధి చెందారు.
ఏడాదిలో 'చైత్రమాసం' మొదలు ... 'ఫాల్గుణ మాసం' వరకూ ఒక్కో సూర్యుడు ఒక్కో మాసంలో సంచరిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయా సూర్యులు ప్రసరింపజేసే సూర్య కిరణాల సంఖ్యలో కూడా మార్పులు ఉంటాయని అంటున్నాయి. చైత్ర మాసంలో 'ధాత' అనే సూర్యుడు 8000 కిరణాలతో సంచరిస్తూ ఉంటాడు.
వైశాఖంలో 'అర్యముడు' 10,000 కిరణాలతోను .. జ్యేష్ట మాసంలో 'మిత్రుడు' 7000 కిరణాలతోను ... ఆషాడంలో 'వరుణుడు' 5000 కిరణాలతోను సంచరిస్తూ వుంటారు. ఇక శ్రావణంలో 'ఇంద్రుడు' 7000 కిరణాలతోను ... భాద్రపదంలో 'వివస్వంతుడు' 10,000 కిరణాలతోను ... ఆశ్వయుజ మాసంలో 'త్వష్టా' 8000 కిరాణాలతోను ... కార్తీక మాసంలో 'విష్ణువు' 6000 కిరణాలతోను సంచరిస్తూ వుంటారు.
అలాగే మార్గశిర మాసంలో 'అంశుమంతుడు' ... 9000 కిరణాలతోను ... పుష్యమాసంలో 'భగుడు' 11000 కిరణాలతోను ... మాఘమాసంలో 'పూషా' 6000 కిరణాలతోను ... ఫాల్గుణ మాసంలో 'పర్జన్యుడు' అనే సూర్యుడు 9000 కిరణాలతోను సంచరిస్తూ ఉంటారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.