బెంగుళూర్ సాయి మందిరం
కులమతాలకు అతీతంగా భక్తి మార్గంలో ప్రజలను నడిపించిన సద్గురువు శ్రీ శిరిడీ సాయిబాబా. ముంచుకురానున్న ముప్పును గురించి ముందుగానే తన భక్తులకు తెలియజేసి వారిని అప్రమత్తం చేయడం బాబాకి అలవాటు. ఆ ప్రమాదాలను వారు ఎదుర్కోలేని పరిస్థితుల్లో తానే రంగంలోకి దిగడం ఆయన నైజం. ఎప్పుడు చూసినా ఎంతో ప్రశాంతంగా కనిపించే బాబా, తన దగ్గరికి వచ్చిన వారిని ఆత్మబంధువుల్లా ఆదరించేవాడు.
సమాధి చెందిన అనంతరం కూడా తాను తన భక్తులను కాపాడుతూనే వుంటాననే మాటను నేటికీ ఆయన నిలబెట్టుకుంటూనే వస్తున్నాడు. ఈనాటికీ భక్తులకు ఎదురవుతోన్న అనుభవాలే ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు. ఈ కారణంగానే అనేక ప్రాంతాల్లో ఆయన మందిరాలు కొలువుదీరుతూ వస్తున్నాయి.
అలాంటి మందిరాలలో బెంగుళూర్ కి చెందిన సాయి మందిరం కూడా ఒకటిగా అలరారుతోంది. కొంతకాలం క్రితం ఇక్కడి ఖాళీ స్థలంలో బాబా మందిరం చిన్నది ఏర్పాటు చేసుకుని కాలనీ వాసులు పూజించడం ప్రారంభించారు. అనతికాలంలోనే అందరి జీవితాలు ఉన్నతమైన స్థితికి చేరుకోవడంతో, అంతాకలిసి బాబాకి అత్యంత ఖరీదైన ఆలయాన్ని నిర్మించారు. రెండు అంతస్తులుగా కనిపించే ఈ ఆలయంలో బాబా వైభవంగా వెలుగొందుతున్నాడు. వేదికపై బాబా సజీవంగా కూర్చుని దర్శనమిస్తున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది.
'గురుపౌర్ణమి' రోజున ఇక్కడ పండుగ వాతావరణం నెలకొని వుంటుంది. భక్తులు చేసే భజనలతో ఆలయం సందడిగా ... సంతృప్తికరంగా కనిపిస్తూ వుంటుంది. అనునిత్యం నాలుగు హారతులు నేత్రానందంగా జరుగుతుంటాయి. ఇక ప్రతి గురువారంతో పాటు విశేషమైన పర్వదినాల్లో జరిగే పల్లకీ సేవ ... పవళింపు సేవను చూసితీరవలసిందే.