putin: ట్రంప్‌ను ఏ సమయంలోనైనా సరే కలవడానికి సిద్ధం: రష్యా అధ్యక్షుడు పుతిన్
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌పై సానుకూల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పుతిన్ కూడా అమెరికాతో మైత్రిని పెంచుకునే దిశగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తాను ఏ సమయంలోనైనా ట్రంప్‌ను కలవడానికి సిద్ధమేనని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా, ట్రంప్‌తో ఎప్పుడు సమావేశమవుతారని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పుతిన్, ఆయనను కలవడానికి తమ తరఫున ఎలాంటి సమస్యా లేదని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థాయికి రావాలని డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే చెబుతున్నారని, అందుకు తాము మద్దతు పలకాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
అమెరికా, రష్యాల మధ్య సత్సంబంధాలు బలహీనంగా ఉండడంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనడం అంత సులువు కాదని తెలిసినా తమ ప్రయత్నం తాము చేస్తామని పుతిన్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తాను ఆయనను కలిసే అవకాశం ఉందని చెప్పారు.