jaipal reddy: కేసీఆర్ దగ్గర డబ్బు ఉందో లేదో నేను మాత్రం చెప్పలేను: జైపాల్ రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతల వద్ద డబ్బు ఉందని కేసీఆర్ ఆరోపిస్తున్నారని, అయితే, డబ్బున్న వారి ఇళ్ల మీద ఐటీ దాడులు చేయించాలని ప్రధాని నరేంద్రమోదీకి కేసీఆర్ చెప్పవచ్చని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పటినుంచో బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కు మోదీ ఓ మిత్రుడని ఆయన వ్యాఖ్యానించారు. 2009, 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారని ఆయన అన్నారు. బీజేపీతో కేసీఆర్ కు ఉన్నసంబంధం ఏంటో భగవంతుడికి మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వద్ద డబ్బు ఉందో లేదో తాను మాత్రం చెప్పలేనని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను అటువంటి వ్యాఖ్యలు చేయబోనని, అయితే, ఈ అంశంలో తనకు అనుమానాలు మాత్రం ఉన్నాయని ఆయన అన్నారు. పెద్దనోట్లను రద్దు చేసే ముందువరకు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఆ తరువాత ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకున్నారని, దీనిపై మాత్రం తనకు కొన్ని అనుమానాలున్నాయని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కి సంబంధించి ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా తాను మాట్లాడలేనని, ఇంకా మాట్లాడితే అవన్నీ ఊహాగానాలే అని అనుకుంటారని వ్యాఖ్యానించారు.