facebook: సోషల్ మీడియాలో ఎలా మెలగాలో తెలపండి.. తల్లిదండ్రుల కోసం ఫేస్బుక్ కొత్త పోర్టల్
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొందరు పిల్లలు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు సోషల్ మీడియాలోకి తొంగి చూస్తూనే ఉంటారు. ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సైట్లలో తాము పెట్టిన పోస్టులకి ఎన్ని లైకులు వస్తే అంత గ్రేటుగా ఫీలయిపోతుంటారు. ఒకవేళ లైకులు తక్కువగా వస్తే పెద్ద విజయాన్ని కోల్పోయినట్లు బాధపడిపోతుంటారు. ఎంతో మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. అంతేగాక యువకులు సోషల్‌మీడియా ద్వారానే ప్రేమలో పడడం, ఆ తరువాత అనర్ధాలు జరుగుతుండడం వంటి వార్తలు రోజూ వింటూనే ఉన్నాం. హ్యాకర్లు కూడా సోషల్‌మీడియా ద్వారా లింకులు పంపుతూ కంప్యూటర్, మొబైల్లో ఉండే ముఖ్యమైన డేటాను, బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలుసుకుంటున్నారు. ఇటువంటి వాటిపై జాగ్రత్తలు చెప్పేందుకే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తమ సైట్లో ప్రత్యేకంగా తల్లిదండ్రుల కోసం ఓ కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది.
సోషల్ మీడియాలో ఎలా మెలగాలో పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించేందుకు వీలుగా ఈ పోర్టల్ ను తీసుకొచ్చింది. ఫేస్బుక్ పనితీరు, పిల్లలకు జాగ్రత్తలు నేర్పడంతో పలు అంశాలు వాటిపై సందేహాలకు నిపుణుల సలహాలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. పలు వీడియోలను కూడా ప్రత్యేకంగా రూపొందించిన ఫేస్బుక్ నిర్వాహకులు... అందులో ఉంచుతున్నారు. మొత్తం భాషల్లో ఈ సమాచారాన్ని ఉంచారు. వాటిల్లో 11 భారతీయ భాషలు కూడా ఉన్నాయి. www.facebook.com/safety/parents లింక్‌కు వెళ్లి ఫేస్బుక్ రూపొందించిన ఈ ప్రత్యేక పోర్టల్‌ను చూడొచ్చు.